భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగిందింది. శుక్రవారం అర్ధరాత్రి కారు-లారీ ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన కోటిలింగాల సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులది హన్మకొండ జిల్లాలోని కమలాపురం మండలంగా గుర్తించారు. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్లుగా పని చేస్తున్న రాము, అరవింద్ ఏపీలోని చింతూరు మండలం మోతెలో జరిగే ఓ వెడ్డింగ్ షూట్‌లో పాల్గొనేందుకు కమలాపురం నుంచి కారులో బయల్దేరారు. హన్మకొండలో స్నేహితులు రుషి, కల్యాణ్, రణధీర్ జత కలిశారు.
ఐదుగురూ కలిసి మహబూబాబాద్ మీదుగా మోతె వెళ్తుండగా ఇల్లెందు సమీపాన ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదదాటికి కారు నుజ్జునుజ్జుగా మారింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా… ఆస్పత్రికి తరలించే క్రమంలో ఒకరు ప్రాణాలు వదిలారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెంటనే చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి… గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.