తెలంగాణ యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో దండు మల్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందారు. గురువారం ఉదయం కూలీలతో వెళ్తున్న ఆటోను, తేజస్ ఫుడ్ ఇండస్ట్రీస్ కు చెందిన ప్రైవేటు బస్సు ఢీ కొట్టింది. ప్రమాద స్థలం నుంచి సుమారు 20 మీటర్ల వరకు ఆటోను బస్సు లాక్కెళ్లింది.
పలువురికి గాయాలవడంతో వారిని స్థానికులు వెంటనే హయత్‌నగర్‌లోని సన్ రైజ్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. మృతులు దేవులమ్మ నాగారం గ్రామానికి చెందిన చిలువేరు ధనలక్ష్మి (35), దాకోజు నాగలక్ష్మి (28), వర్గాంతం అనసూయ (50), దేవరపల్లి శిరీష (30)గా గుర్తించారు.
మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరికొంత మంది కూలీలకు వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది కూలీలు ఉన్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
సీఐ మల్లికార్జున్ రెడ్డి, ఎస్ఐ సీతాపాండు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబానికి చెందిన వారు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్న తీరు అందరిని కంటతడి పెట్టిస్తోంది.