హైదరాబాద్ ఉప్పల్ లో దారుణం చోటు చేసుకుంది. తండ్రీకొడుకుల్ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈరోజు ఉదయం 5:30 సమయంలో ముసుగులు ధరించిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి కత్తులతో దాడి చేసి నర్సింహ మూర్తి (70) అనే వ్యక్తిని పొడవగా.. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన నర్సింహ కుమారుడు శ్రీనివాస్ మూర్తి(50)ను కూడా కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు.
దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న డీసీపీ, ఏసీపీలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ హత్యలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు.
పాత కక్షలతో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భూవివాదంలో గతంలో కూడా ఈ విధమైన దాడి జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ మలేషియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఇటీవలే ఆయన హైదరాబాద్ వచ్చారు. తండ్రి హత్యను అడ్డుకునే ప్రయత్నంలో ఆయన కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
రెండు హత్యలతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఈ హత్యలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.