తల్లి నవమాసాలు మోసి బిడ్డను కని,తన కడుపు పై ముడతలను చూసుకుని అవి తన బిడ్డ తొలి గుర్తులుగా భావిస్తుంది. మాకు సంతోషకరమైన జీవితాన్ని అందించడానికి అతడు పడిన కష్టానికి,పోరాటానికి గుర్తులే మా నాన్న ముఖంపైన ముడతలు…40 ఏళ్లు పై బడ్డాక పిల్లల్ని కంటే సెలబ్రిటిల జీవితాల్లో ఇది పెద్ద విషయం కాదు..మా వరకు ఇది నిజంగా పెద్ద విషయమే..కానీ చాలామందికి తెలియని చాలా విషయాల్ని ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను..
మా నాన్నకి 42ఏళ్లప్పుడు పెళ్లయింది..అమ్మానాన్నల మధ్య వయసు భేదం 14 ఏళ్లు.. నాన్నకి 43 ఏళ్లున్నప్పుడు నేను పుట్టాను ..ఇప్పుడు నా వయసు 21.. మా నాన్న వయసు గురించి చాలామంది నన్ను చాలా ప్రశ్నలు అడిగేవారు..నా ఫ్రెండ్స్ ఫాధర్స్ యంగ్ గా ఉండేవాళ్లు..దాంతో వాళ్లంతా నన్ను ఆటపట్టించేవాళ్లు..అతడు మీ నాన్ననా లేకపోతే తాతనా అంటూ.. ఇంతకంటే భయంకరమైన ప్రశ్నలు మా అమ్మ ఎదుర్కొంది..
మీ ఆయన మరీ ముసలివాడు కదా??మీ జీవితం ఎలా ఉంది..ఈ వయసులో కూడా బాగానే కొడుకుని కన్నాడు..నేనిక్కడ చెప్పలేను..ఇంతకంటే ఘోరమైన క్వశ్చన్స్ అడిగేవారు.. వాటన్నింటికి మా అమ్మ ఒక్కటే సమాధానం చెప్పేది.. “అతను నా భర్తగా లభించడం నా అదృష్టం” అని.. ఆ సమాధానం ఇప్పటికి నా చెవుల్లో వినపడుతూ ఉంటుంది..అవును 64 ఏళ్ల కమలేందు మిశ్రా నా తండ్రి అని నేను గర్వంగా చెప్పుకోగలను..

తన కోసం కాకుండా తన కుటుంబం కోసం బతికిన మంచి మనిషి మా నాన్న.. నలభై ఏళ్లు వచ్చే వరకు కూడా తోడబుట్టిన వారికోసం పాటుపడ్డాడు.. వాళ్లంతా మా నాన్న సంపాదించిన ఆస్తుల్ని లాక్కుని తనని ఏం లేనివాడిగా మిగిల్చినా కూడా ఏ మాత్రం కోపం తెచ్చుకోకుండా మళ్లీ మొదటి నుండి జీవితం మొదలు పెట్టారు.. తన జీవితంలోకి వచ్చేవారికోసం అన్ని సమకూర్చాలనుకున్నారు..
అదృష్టం ఆయనదో, మా అమ్మదో..లేకపోతే వారి కడుపున పుట్టిన నాదో నాకు ఇప్పటికి అర్దం కాదు..నలభై ఏళ్లప్పుడు మా అమ్మ ఆయన జీవితంలోకి వచ్చింది.. రెండేళ్లు ఆలోచించి చివరకి ఒక నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకున్నారు..ఏడాదికి నేను పుట్టాను.. తను పడిన కష్టాలేవి నేను పడకూడదని మా నాన్న తపన..తనను నమ్మి వచ్చిన మా అమ్మని కంటికి రెప్పలా చూసుకోవాలని ఆరాటం..
కేవలం నన్ను మా అమ్మని బాగా చూసుకున్న మంచి వ్యక్తి మాత్రమే కాదు..తానొక సంస్కృత ఉపాధ్యాయుడు..ఎందరో విద్యార్ధులను తీర్చిదిద్దాడు.. మా నాన్న సంపాదించిన ఆస్తుల్ని అమ్ముకుని బతికేవాళ్లు కూడా ఒకప్పుడు మా నాన్నని అనరాని మాటలన్నారు.. వారి మాటలకు ఒకప్పుడు బాధపడ్డాను..కానీ వాళ్లు మా నాన్న కాలిగోటికి కూడా సరిపోరని అర్దం అయింది.. లవ్ యూ నాన్న..!