తను కన్న కూతుర్నే కడతేర్చాడు ఓ కసాయి తండ్రి. నాన్నే తన ప్రాణం తీస్తాడని ఆ చిన్నారి ఊహించలేకపోయింది. మారాం చేస్తే నాన్న బుజ్జగిస్తాడనుకుంది కానీ.. చంపేస్తాడని తెలుసుకోలేకపోయింది. అమ్మ కావాలని ఏడిస్తే.. ఇంటికి రప్పిస్తాడనుకుంది. కానీ భార్యపై కోపంతో ఆరేళ్ల కూతుర్ని కన్న తండ్రే హతమార్చిన అమానవీయ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లాలోని పాలకొండ తండాకు చెందిన శివకు, అదే తండాకు చెందిన శోభతో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కూలీ పని చేసే శివ మద్యానికి బానిసై రోజూ భార్యను కొట్టి వేధించేవాడు. ఇది భరించలేని శోభ.. 10 రోజుల క్రితం ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వెళ్లింది.
పెద్ద కూతురు కీర్తన తండ్రితోనే ఉంటోంది. బుధవారం రాత్రి అమ్మ కావాలని ఆ చిన్నారి ఏడవటంతో కోపంతో చిన్నారి ముక్కు, నోరు మూశాడు శివ. దీంతో ఊపిరాడక చిన్నారి గిలగిలా కొట్టుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఎంతసేపటికీ చిన్నారి లేవకపోవడంతో.. అర్థరాత్రి తండ్రి, తాత మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చిన్నారి మరణించిందని చెప్పారు.
ముందు పాముకాటుతో చనిపోయిందని, ఆ తర్వాత ఆకలితో చనిపోయిందని శివ చెప్పడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేను నమోదు చేసుకుని, శివను విచారణ చేశారు పోలీసులు. అయితే చిన్నారిని తానే హత్య చేసినట్టు తండ్రి శివ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.