– తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం అసహనం
– బియ్యం పంపిణీలో విఫలం అంటూ ప్రకటన
– అక్రమ మిల్లర్ల తీరుపైనా ఆగ్రహం
– బియ్యం సేకరణ నిలిపివేతపైనా క్లారిటీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చాలారోజులుగా ధాన్యం పంచాయితీ నడుస్తోంది. ఒకరిపై ఒకరు నిందలేసుకుంటూ మధ్యలో రైతులకు అన్యాయం చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో కేంద్రం తీరుపై ఇప్పటికీ టీఆర్‌ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. అయితే.. బియ్యం సేకరణ నిలిపివేతపై కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. అందులో టీఆర్‌ఎస్ సర్కార్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
అన్న యోజన పథకం కింద పేదలకు ఇవ్వాల్సిన బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందనేది కేంద్రం ఆరోపణ. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయం గురించే వివరిస్తూ పలు విమర్శలు చేసింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో విఫలం అయినందు వల్లే బియ్యాన్ని సెంట్రల్ పూల్ లోకి సేకరించడాన్ని నిలిపివేశామని తెలిపింది కేంద్రం. ఆ పరిస్థితికి కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టం చేసింది.
ఇటు అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లను అదుపు చేయడంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయిందని పేర్కొంది. కేంద్ర బృందాల ప్రత్యక్ష తనిఖీల సమయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోని వైనాన్ని గమనించిందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ఆరోపించింది. 40 మిల్లుల్లో 4,53,896 బియ్యం సంచుల మాయమవడాన్ని గుర్తించామని, డిఫాల్టయిన మిల్లర్ల జాబితాను మార్చి 31న తెలంగాణ ప్రభుత్వానికి పంపించామని వివరించింది.
బియ్యం సేకరించాలంటే అన్న యోజన కింద పంపిణీ చేయడంతోపాటు అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని సూచించింది కేంద్రం. అలాగే మిల్లర్లు బియ్యం సేకరించే విధానాన్ని పూర్తి స్థాయిలో ఫాలో కావాలని స్పష్టం చేసింది. వీటిపైన యాక్షన్ తీసుకుని రిపోర్ట్ పంపిస్తే అప్పుడు బియ్యం సేకరిస్తామని స్పష్టం చేసింది. ఈ అంశంలో టీఆర్ఎస్ గత కొంత కాలంగా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి 18 శాతం దెబ్బతిన్న గోధుమల కొనుగోలుకు అంగీకరించి.. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ను ఎందుకు కొనరని ప్రశ్నిస్తోంది.