– అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత
– తారస్థాయికి ప్రతిపక్షాల విమర్శలు
– హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత మారిన పరిస్థితులు
తెలంగాణ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా సీఎం కేసీఆర్‌కు పేరుంది. ప్రత్యర్థులకు అంతుచిక్కని వ్యూహాలను ఆయన ఎప్పటికప్పుడు రచించుకుంటారని రాజకీయ పరిశీలకులు చెప్తుంటారు. కేసీఆర్ నాయకత్వంలో అలా ఉద్యమ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చి రెండు సార్లు తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చారు. కాగా, ఈ సారి అంత ఈజీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు టీఆర్ఎస్‌కు లేవనేది రాజకీయ వర్గాల మాట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి వెరీ టఫ్ ఫైట్ ఉండబోతున్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, సమీకరణాల్లో మార్పులు వచ్చాయి. ఎన్నికల వ్యయం బాగా పెరిగింది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ హుజురాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీకి నల్లేరు మీద నడక కాదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.
రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. భూ కబ్జాలు, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వంటి ఆరోపణలు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు డమ్మీలు అయిపోయారని బాహాటంగానే కొందరు విమర్శలు చేస్తున్నారు. వీటికి తోడు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలుపైన ప్రజలు నిలదీసే అవకాశాలున్నాయి.
దళితులకు మూడెకరాల భూమి, ‘డబుల్’ ఇండ్లతో పాటు నిరుద్యోగ భృతి వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దివాళా తీసిందన్న సంగతి ఉద్యోగులకు వేతనాలు సమయానికి అందకపోవడం ద్వారా స్పష్టమవుతోంది. ఇక ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శల జోరు కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఓ వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీతో పాటు విపక్షాలు అధికార టీఆర్ఎస్ పైన యుద్ధానికి సై అంటున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు కేసీఆర్ సర్వప్రయత్నాలు చేసినప్పటికీ ప్రస్తుతం మళ్లీ ప్రతిపక్షాలు బలపడే పరిస్థితులు కనబడుతున్నాయి. దానికి తోడు అధికార టీఆర్ఎస్ నుంచి కూడా ఇతర పార్టీల్లోకి నేతలు జంప్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. టీఆర్ఎస్ అధినేత జాతీయ రాజకీయాలపైన దృష్టి పెడుతున్న క్రమంలో ప్రతిపక్షాలు అధికార టీఆర్ఎస్ నేతలపైన ఫోకస్ పెడుతోంది. అయితే, తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.