– మునుగోడు బైపోల్ వార్
– ప్రచారంలో బిజీగా గులాబీ పార్టీ
– ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు
– కానీ, నోరు జారుతున్న టీఆర్ఎస్ నేతలు
– ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు..!
మామూలుగా ఐదైనా ఉప ఎన్నిక వస్తే.. గెలుపు మాదే అని చెబుతారు. అదే అధికార పార్టీ అయితే.. ఇంకా ఎక్కువగా చెబుతుంటుంది. కానీ, టీఆర్ఎస్ మాత్రం దానికి రివర్స్ లో ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వచ్చే ఎన్నికలకు సెమీస్ గా భావిస్తున్న మునుగోడులో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు గులాబీ నేతలు. ఓటర్లకు మందు, ముక్క సప్లయ్ చేస్తూ ఆకర్షించుకుంటున్నారనే విమర్శలను కూడా మూటగట్టుకుంటున్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. అందుకే ప్రలోభాలకు తెరతీశారని చెబుతున్నాయి. అయితే, గులాబీ నేతలు మాత్రం విజయం మాదేనని గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.
పైకి ఎన్ని చెప్పినా లోపల ఓటమి భయం అలాగే ఉందని.. మంగళవారం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. తాజాగా మంత్రి తలసాని చేసిన కామెంట్స్ ను చూస్తే అర్థం అవుతోందని అంటున్నారు విపక్ష నేతలు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన టీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 105 అసెంబ్లీ సీట్లున్న టీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కోల్పోయినంత మాత్రాన పోయేదేమీ లేదని వ్యాఖ్యానించారు. ఓవైపు గెలుస్తామని చెబుతూనే.. ఇంకోవైపు ఇలా ఒకటి పోయినంత మాత్రాన ఏం కాదని అనడం చూస్తుంటే గెలుపు నమ్మకం లేదనేది అర్థం అవుతోందని అంటున్నారు విపక్ష నేతలు.
తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ నాంపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. హుజూరాబాద్, దుబ్బాకలో గెలిచిన వాళ్ళు కేంద్రం నుంచి ఎన్ని డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో కూసుకుంట్ల ఓడిపోయినా ఇక్కడే ఉంటాడు.. రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే ఉండడని మాట్లాడారు. ఓవైపు జోరుగా ప్రచారం సాగిస్తూ.. ఇంకోవైపు అభ్యర్థి ఓటమి గురించి మాట్లాడడం అవసరమా? అనే అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తాయని మాట్లాడుకుంటున్నారు.
మరోవైపు కేటీఆర్ కామెంట్స్ పై స్పందించిన రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. ‘‘మీకు ఈ ఉప ఎన్నిక కేవలం యూనిట్ టెస్ట్ అయితే 86 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులతో మకాం ఎందుకు? నీ కుటుంబ అవినీతిని బట్టబయలు చేయడానికే ఈ ఉప ఎన్నిక. మీ బలుపు మాటలకు జనం ఓట్లతోనే బుద్ధి చెప్తారు’’ అంటూ సెటైర్ వేశారు. అంతేకాదు ‘‘కేసీఆర్ కుటుంబం ధరణి పోర్టల్ తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 18 లక్షల కోట్ల రూపాయిల భూములు ఆక్రమించింది. ఇది దేశంలోనే అతి పెద్ద భూ స్కాం! ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని డిమాండ్ చేశారు.