రాజస్థాన్ లో జరిగిందీ అమానుషం. మూడో బిడ్డ పుడితే తన ఉద్యోగం పోతుందని భయపడిన కసాయి తండ్రి తన మూడున్నర నెలల వయసున్న ఆడబిడ్డను కాలువలో విసిరేశాడు. ఈ ఘోరంలో అతనికి అతని భార్య కూడా సహకరించింది. బికనీర్ జిల్లా చత్తర్ ఘర్ ప్రాంతంలో జరిగిన ఈ దారుణంలో ఆ భార్యాభర్తలిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.
జన్వర్ లాల్ మేఘావల్ అనే వ్యక్తి, ఈ ప్రాంతంలో కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగం చేస్తున్నాడని, ఇటీవల తన భార్యతో సహా ఓ బైక్ పై వెళ్లి ఓ కాలువలో ఆ పసిబిడ్డను విసిరేశాడని బికనీర్ పోలీసులు తెలిపారు.
కొంతదూరం నుంచి ఇది చూస్తున్న స్థానికులు దిగ్భ్రాంతి చెంది వారిని పట్టుకోవడానికి రాగా పారిపోయారని వారు చెప్పారు. తమ ఎనిమిదేళ్ల కూతురిని ఈ భార్యాభర్తలు తమ సమీప బంధువుకు దత్తత ఇచ్చినట్టు కూడా తెలిసిందన్నారు. రాజస్థాన్ లో
ఇద్దరికి మించి పిల్లలున్నవారికి ఉద్యోగం ఇవ్వరాదనే నిబంధన ఉంది. రాష్ట్రంలో టూ చైల్డ్ పాలసీని ప్రభుత్వం అమలు చేస్తోంది.
తనది కాంట్రాక్ట్ ఉద్యోగం గనుక..దీన్ని పర్మనెంట్ చేసుకోవాలనుకుంటే తమకు ఇద్దరు పిల్లలున్నట్టే జన్వర్ లాల్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే మూడో బిడ్డ కూడా పుట్టినందున ఆ బిడ్డను కర్కశంగా ఇలా వదిలించుకున్నాడు. కాలువలో విసిరేసిన పసికందును స్థానికులు కొందరు వెంటనే రక్షించి ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఆ బిడ్డ అప్పటికే మరణించింది. తమ కూతురిని హత్య చేసినందుకు ఈ భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.