టాలీవుడ్ లో ఫిబ్రవరి నెల వెలవెలబోయింది. సరైన హిట్ ఒక్కటి లేదు. ఇండస్ట్రీకి కళ తీసుకొచ్చిన మూవీ ఒక్కటి కూడా రాలేదు. ఫిబ్రవరి మొదటి వారంలో.. రైటర్ పద్మభూషణ్, మైఖేల్, బుట్టబొమ్మ, ప్రేమదేశం, మాయగాడు, సువర్ణ సుందరి, తుపాకులగూడెం సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో రైటర్ పద్మభూషన్ ఒక్కటే ఆకట్టుకుంది.
అలా అని ఇదేదో బ్లాక్ బస్టర్ కాదు. ఉన్నంతలో ఓకే అనిపించుకుంది. సుహాస్ స్థాయికి తగ్గ విజయం దక్కింది. ఈ సినిమాతో పాటు వచ్చిన మైఖేల్, బుట్టబొమ్మ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. లాంగ్ గ్యాప్ తర్వాత సందీప్ కిషన్ కు ఫ్లాప్ తప్పలేదు.
రెండో వారంలో.. కూడా చాలా సినిమాలు క్యూ కట్టాయి. వేద, అమిగోస్, దేశం కోసం, పాప్ కార్న్, అల్లంత దూరాన, చెడ్డీ గ్యాంగ్ తమాషా, సిరిమల్లెపువ్వా, ఐపీఎల్, వసంత కోకిల సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో అంచనాలు పెంచిన సినిమా మాత్రం అమిగోస్. కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
మూడో వారంలో.. సార్, ఊ అంటావా మామా ఉఊ అంటావా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ధనుష్ హీరోగా నటించిన సర్ సినిమా హిట్టయింది. పెట్టిన బడ్జెట్ వెనక్కి రావడంతో పాటు, డిస్ట్రిబ్యూషన్ షేర్ కూడా కొంత మిగిలింది.
ఇక ఆఖరి వారంలో.. కోనసీమ థగ్స్, డెడ్ లైన్, మిస్టర్ కింగ్ సినిమాలు రిలీజ్ అవ్వగా, వేటికవే ఫ్లాప్ అయ్యాయి. ఓవరాల్ గా రైటర్ పద్మభూషణ్, సార్ సినిమాలు మాత్రమే ఫిబ్రవరి నెలలో మెరిశాయి.