కేంద్ర పౌర విమానయాన శాఖకు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ కి మధ్య తగవు తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. ఎయిరిండియా విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలిపై శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్రం పోసిన ఘటన కేసులో సంబంధిత పైలట్ లైసెన్స్ ని డీజీసీఏ మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. పైగా ఎయిరిండియాకు 30 లక్షలు, ఇన్-సర్వీసెస్ డైరెక్టర్ కు 3 లక్షల జరిమానా విధించింది. ఈ పరిణామాలపై ఇండియన్ పైలట్స్ సమాఖ్య తీవ్రంగానే స్పందిస్తూ పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాసింది.
మమ్మల్ని డీజీసీఏ ఇలాగే భయపెడుతూ పోతే.. ఒక ప్యాసింజర్ ను మధ్యలోనే దించివేయడానికో లేక అతనిపై ఎఫ్ ఐ ఆర్ దాఖలయ్యే పరిస్థితి ఉత్పన్నమయ్యేలా చూడడానికో పైలట్లు వెనుకాడబోరని, అప్పుడది ఇండస్ట్రీలో అనుచిత, అవాంఛనీయ పరిణామాలకు దారి తీస్తుందని ఈ లేఖలో వారు హెచ్చరించినంత పని చేశారు. పైలట్ల లైసెన్సులను విచక్షణా రహితంగా రద్దు చేయడానికి డీజీసీఏకి గల అధికారాలను వారు ప్రశ్నించారు.
ఎయిరిండియా న్యూయార్క్- న్యూఢిల్లీ- విమాన పైలట్ లైసెన్సును రద్దు చేయడాన్ని పైలట్లు ప్రధానంగా ప్రస్తావించారు. అసలు దీనిపై డీజీసీఏ స్పందనపై మీడియాలో సెన్సేషనల్ గా వార్తలు వచ్చాయని, ఈ ఘటనపై ఈ సంస్థ తనకు తాను సొంతంగా ఎందుకు విచారణ చేయలేదని పైలట్లు ప్రశ్నించారు.
ఈ విమాన పైలట్ దోషిగా నిరూపితమయ్యేంతవరకు జరిగిన సంఘటన గురించి అతనికి ఏమీ తెలియదన్న విషయాన్ని డీజీసీఏ కావాలనే విస్మరించిందా అని వీరు పేర్కొన్నారు. ఈ పైలట్ ని శిక్షించారు గానీ, మరి ఇదే సంస్థకు చెందిన మేనేజర్ పై ఎందుకు చర్య తీసుకోలేదన్నారు. అతడిని ఎందుకు వదిలివేశారన్నారు. ఇకపై మేము కూడా కొంత కఠినంగానే ఉంటామన్నట్టు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ హెచ్చరించింది. ప్రయాణికులకు, సేవలందించే ఇండస్ట్రీకి మధ్య గల వాతావరణానికి ఇలాంటి చర్యలు అనువుగా ఉండబోవన్నారు. ఇక ఈ పైలట్ లైసెన్స్ ను పునరుద్ధరించాలని, సస్పెన్షన్ ను ఎత్తివేయాలని ఆరు యూనియన్ల జాయింట్ ఫోరమ్ నిన్న డీజీసీఏకి విజ్ఞప్తి చేసింది.