గత మూడు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు సకాలంలో ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయడం లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. బకాయిలు ఆలస్యం కావడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ట్యూషన్ ఫీజులు చెల్లించాలని విద్యార్ధులపై ఒత్తిడి పెంచుతున్నారని విరుచుకుపడ్డారు. వార్షిక పరీక్ష హాల్ టికెట్ లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నత విద్యపట్ల నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. ఫీజుల బకాయిలను సంవత్సరాల తరబడి ఇవ్వకపోవడంతో ఇప్పటికే వేల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు చూస్తుంటే చదువును కొనాలనే భావనతో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు అనిపిస్తోందన్నారు.
కాస్తో కూస్తో ఉన్న వ్యవసాయ భూములను తాకట్టు పెట్టి.. తల్లిదండ్రులు తమ పిల్లల ఫీజులు చెల్లిస్తున్నారని వివరించారు శ్రీనివాస్ గౌడ్. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తమ రక్తాన్ని అమ్ముకొని చదుకున్న విద్యార్థులు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదే దుస్థితి దాపురించిందని విరుచుకుపడ్డారు.
బీసీ విద్యార్థుల బకాయిలు రూ. 1546 వేల కోట్లు.. ఎస్సీ విద్యార్థుల బకాయిలు రూ. 612 కోట్లు.. ఎస్టీ విద్యార్థుల బకాయిలు రూ. 291 కోట్లు.. మైనార్టీ విద్యార్థుల బకాయిలు రూ. 485 కోట్లు.. ఈబీసీ విద్యార్థుల బకాయిలు రూ. 331 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. పెండింగ్ లో ఉన్న బకాయిలన్నింటినీ వారంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వందలాది మంది విద్యార్థులతో కలిసి రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు శ్రీనివాస్ గౌడ్.