రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాలకు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అంతా నీటిపాలైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేక.. కల్లాల్లో పోసిన ధాన్యం కళ్లముందే కొట్టుకుపోతున్నా చేసేదేం లేక కంటనీరు పెట్టుకున్నారు రైతులు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు భారీగా నష్టపోయామని వాపోతున్నారు. ప్రభుత్వం అన్ని రకాల మౌళిక వసతులు కల్పిస్తే.. కల్లంలో పోసిన పంట నీటిపాలు కాకపోయి ఉండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు.
ఇటీవల కురిసిన వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో రైతులు భారీగా నష్ట పోయారు. పంట పెట్టుబడులకు కోసం చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురైన ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానికుల సాయంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ మహిళా రైతు మృతి చెందింది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నల్గొండ జిల్లావ్యాప్తంగా కురిసిన కుండపోత వర్షానికి.. జిల్లాలోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసిపోయింది. పెద్దపల్లి జిల్లాలోలోని మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. మంథని మార్కెట్ యార్డుతో పాటు.. పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోగా.. ధాన్యం కుప్పల చుట్టూ చేరిన వర్షపు నీటిని రైతులు తొలగించారు.
వరంగల్ జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసింది. చేతికందొచ్చిన పంట నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కరీంనగర్ జిల్లా కురిసిన అకాల వర్షానికి హుజూరాబాద్, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డుకు తరలించిన ధాన్యం వర్షపు నీటితో కాలువల వెంట కొట్టుకుపోయింది. జగిత్యాల జిల్లాలో ధాన్యం రాశులు వరద పాలయ్యాయి. ఎలాంటి ఆంక్షలు లేకుండా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.