మానవత్వం మనిషిని దేవుణ్ణి చేస్తుంది.ఈ విషయాన్ని దాదాపు అన్నిమతాలు చెప్పాయి.అయితే సాంప్రదాయం పేరుతో మనిషి పుట్టుకకు కారణమైన స్త్రీని బంధిస్తున్నాయని, మగవాడితో సమానంగా మెలగాల్సిన స్త్రీని హింసిస్తున్నాయని కొన్ని దేశాల తీరుపై ప్రపంచ వ్యాప్తమైన ఆరోపణలున్నాయి. అలాంటి దేశాల్లో తాలిబన్ దేశమొకటి.
ఆడవారిపై ఆంక్షల విషయంలో తాలిబన్లు అన్ని దేశాలకంటే అత్యంత కఠినంగా ఉంటారు. దానికి ఉదాహరణే స్త్రీ బొమ్మకు సైతం బురఖా తొడిగిన ఘటన..! ఆశ్చర్యంగా ఉంది కదా..!? మహిళలు మాత్రమే కాదు..మహిళ బొమ్మైనా సరే ముఖం బయటకు కనిపించకుండా బురఖా ఉండాల్సిందేనని తాలిబన్లు స్పష్టం చేస్తున్నారు.
దేశ రాజధాని కాబూల్ లోని ఓ బట్టల దుకాణంలో బట్టల ప్రదర్శన కోసం పెట్టిన బొమ్మల ముఖాలకు ముసుగు కనిపిస్తోంది. మహిళలు ఒంటరిగా బయటకు రాకూడదని, బురఖా తప్పనిసరిగా ధరించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి కఠినంగా అమలు చేస్తోంది అఫ్ఘాన్ ప్రభుత్వం.
ఇటీవలే, యూనివర్సిటీలలో స్త్రీలకు ప్రవేశంలేదని తేల్చిచెప్పింది. జిమ్ లు, పబ్లిక్ పార్కులు, అమ్యూజ్ మెంట్ పార్కులలోకి కూడా మహిళలను అనుమతించట్లేదు. వీటితో పాటు మహిళలపై చాలా ఆంక్షలు విధించింది. ఇప్పుడు దుకాణాలలో ప్రదర్శనకు పెట్టే మహిళల బొమ్మలకూ ముసుగు ఉండాల్సిందేనని చెబుతోంది.
ఈమేరకు బొమ్మల ముఖాలు కనిపించకుండా ముసుగు వెయ్యాలని తాలిబన్లు తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని దుకాణదారులు చెబుతున్నారు. గత్యంతరంలేక బొమ్మల ముఖాలకు ప్లాస్టిక్ కవర్, క్లాత్ బ్యాగ్ లను కప్పుతున్నట్లు వివరించారు. గతంతో పోలిస్తే ఇప్పుడే కాస్త నయమని మరికొందరు చెబుతున్నారు.
తాలిబన్లు గతంలో పాలించినప్పుడు దుకాణాలలో మహిళల బొమ్మలు ఉంచేందుకు ఒప్పుకోలేదని గుర్తుచేసుకున్నారు. ఒకవేళ ఉంచాల్సి వస్తే ఆ బొమ్మలకు తల లేకుండా చూడాలని ఆదేశించేవారని వివరించారు.