తెలంగాణలో ”దిశ” నిందితుల ఎన్ కౌంటర్ పై పార్లమెంట్ లో తీవ్ర దుమారం రేగింది. చాలా మంది ఎంపీలు తెలంగాణ పోలీసులకు మద్దతు పలకగా కొంత మంది వారితో విభేదించారు. బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖి మాట్లాడుతూ…పోలీసులకు తుపాకులు అలంకారం కోసం ఇవ్వలేదన్నారు. తెలంగాణ పోలీసులు న్యాయ ప్రక్రియను అనుసరించారని తెలిపారు.
అంతకు ముందు ఇదే అంశంపై మాట్లాడిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ ఎన్ కౌంటర్లను తాను సమర్ధించనని స్పష్టం చేశారు. న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలు కోరుతున్నట్టుగా నిందితులను ఎన్ కౌంటర్ చేయడం, కొట్టి చంపడం సరైంది కాదన్నారు. మనం న్యాయప్రక్రియను వేగవంతం చేసి త్వరగా శిక్షలు అమలు చేస్తే ప్రజల నుంచి ఇలాంటి డిమాండ్లు ఉండవన్నారు.
శివసేనకు చెందిన అర్వింద్ సావంత్ భావోద్వేగంతో మాట్లాడారు. ఎన్ కౌంటర్ చేసిన పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారని..న్యాయ వ్యవస్థ వేగవంతమైతే ఇలాంటివి జరగవన్నారు. ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసును ఆయన ఉదాహరించారు. ఈ కేసులో నలుగురికి ఉరి శిక్ష విధిస్తే…వారిలో ఒకడు జైల్లోనే ఉరి వేసుకున్నాడని..మిగతా ముగ్గురిలో ఒకరు రాష్ట్రపతి దగ్గర మెర్సీ పిటిషన్ పెట్టుకోగా..ఇంకొకరు మెర్సీ పిటిషన్ కూడా పెట్టుకోలేదని..మరొకరు రివ్యూ పిటిషనే వేయలేదని తెలిపారు.
రేప్ కేసులను కాంగ్రెస్ లాంటి పార్టీలు రాజకీయం చేస్తున్నాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శిచారు. బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో రేప్ ను రాజకీయం చేసిన పార్టీనే ఇక్కడ కూడా అదేవిధంగా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నావో లో ఏం జరిగిందో. హైదరాబాద్ లో కూడా అదే జరిగిందని… ఇలాంటి వాటికి కఠిన శిక్షలుండాలన్నారు. ఇలాంటి సంఘటనలపై రాజకీయం చేయడాన్ని క్షమించకూడదని… బెంగాల్ లో రేప్ సంఘటనలను రాజకీయం చేసినప్పుడు మీరు నోరు మూసుకొని కూర్చున్నారంటూ కాంగ్రెస్ పై సీరియస్ అయ్యారు.
అప్నాదళ్ ఎంపీ అనుప్రియ పటేల్ ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో రేప్ బాధితురాలిని గుర్తు చేశారు. బెయిల్ పై విడుదలైన నిందితులే బాధితురాలిని కత్తితో పొడిచి, పెట్రోల్ పోసి తగులబెట్టడానికి ప్రయత్నించారని… 90 శాతం కాలిన గాయాలతో ఆమె హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాడుతోందని చెప్పారు. తెలంగాణనా..ఉత్తరప్రదేశా అనేది కాదు…దేశమంతా ఇదే పరిస్థితి. ఈ సమాజంలో రేపిస్టులకు భయం లేకుండా పోయింది.ఈ విషయంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.