రాను రాను గరుకులాల్లో పరిస్థతి చాలా దారుణంగా తయారవుతుంది. విద్యాబుద్దుల కోసం గురుకులాల బాట పడుతున్న పేద విద్యార్థుల ప్రాణాలపైకి వస్తుంది. అన్నంలో పురుగులు, సాంబారులో బల్లి, ఉప్మా నిండా రాళ్లు దీనికి తోడుగా విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన.. చదువుకు బదులుగా గురుకులాల్లో పేద విద్యార్థులకు దక్కుతున్నవి ఇవే.
సర్కార్ మాత్రం గురుకులాలను ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా తయారు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంది. ఏటా వేల కోట్లు గురుకులాల అభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయిస్తుంది. కాని గురుకులాల్లో మాత్రం పరిస్థితులు రోజురోజుకి అత్యంత దారుణంగా మారుతున్నాయి.
తమకు న్యాయం చేసి గురుకులాల్లో మంచి భోజనంతో పాటు మంచి విద్యను అందించేట్టుగా చర్యలు తీసుకోవాలని పలుమార్లు విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కినా.. పరిస్థితుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. తాజాగా మరో దారుణం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ గ్రామంలో ఉన్న గురుకుల్ హాస్టల్లో చోటుచేసుకుంది.
5 వ తరగతి చదువుతున్న పాకుపట్ల గ్రామానికి చెందిన మహిత అనే విద్యార్థి అకస్మాత్తుగా చనిపోయింది. అయితే ఈ ఘటనకు సంబంధించి స్కూల్ యాజమాన్యం చేసిన ప్రకటన పలు అనుమానాలకు దారితీస్తుంది. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థికి గుండె పోటు వచ్చిందని యాజమాన్యం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అయితే ఇదే విషయంలో విద్యార్థిని మృతికి గల కారణాలను తెలుసుకోవడానికి వెళ్లిన బీజేపీ యువమోర్చ కార్యకర్తలను యాజమాన్యం అక్రమంగా అరెస్ట్ చేయించింది.
అయితే ఐదో తరగతి అమ్మాయికి గుండెపోటా …? లేక ఇంకేమైనా జరిగిందా ..? అనే కోణంలో తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు, బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు గురుకులం యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. దీని పై వెంటనే సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గురుకులాల్లో నెలకొన్న దారుణమైన పరిస్థితులపై కేసీఆర్ సర్కార్ చర్యలు చేపట్టక పోతే.. నిరసన బాట పడతామని హెచ్చరిస్తున్నారు బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.