మరోసారి గుత్తికోయలు వార్తల్లోకి వచ్చారు. కొంతకాలం క్రితం వీరు ఓ ఫారెస్ట్ అధికారిని వేటాడి చంపిన ఘటన అందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి అటవీ ప్రాంతంలో అధికారుల మీద తిరగబడ్డారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా ఓటాయి అటవీ ప్రాంతంలో.. మార్చి 14వ తేదీ మంగళవారం సర్వే కోసం కోసం వెళ్లారు సిబ్బంది. రాంపూర్ అటవీ ప్రాంతంలోని వాచ్ టవర్ దగ్గర ఫారెస్ట్ సిబ్బందిని అడ్డుకున్నారు గుత్తికోయలు.
ఈ సందర్భంగా వాగ్వాదం జరిగింది. మాట మాట పెరిగింది. మా భూముల్లోకి అడుగు పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చారు గుత్తికోయలు. పరిశీలించటానికి మాత్రమే వచ్చామని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు సిబ్బంది. ఎంత చెప్పినా గుత్తికోయలు వినకపోగా.. ఫారెస్ట్ సిబ్బందిపై కొడవళ్లు.. గొడ్డళ్లతో దాడికి ప్రయత్నించారు.
దీంతో ఫారెస్ట్ సిబ్బంది తమ వాహనాన్ని వాచ్ టవర్ దగ్గరే వదిలేసి.. కొత్తగూడ అటవీ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. సున్నితమైన అంశం కావటంతో జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు అధికారులు. కొన్నాళ్ల క్రితం అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీనివాసరావును గుత్తికోయలు చంపిన విషయం తెలిసిందే.. ఆ సంఘటన తర్వాత ఆచితూచి వ్యవహరిస్తున్నారు సిబ్బంది.
మహబూబాబాద్ జిల్లాలోని ఓటాయి అటవీ ప్రాంతంలోనూ ఇదే విధంగా గుత్తికోయలు తిరగబడటంతో.. అక్కడే తమ వాహనాన్ని వదిలేసి.. పారిపోయి వచ్చారు అటవీ అధికారులు, సిబ్బంది. మా జోలికి రావొద్దని.. మా భూముల్లోకి రావొద్దంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఆ ప్రాంతంలో నివాసం ఉండే గుత్తికోయలు.. దీన్ని ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాలి.