సీఎం కేసీఆర్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తారో… ఎప్పుడు ఎవరిని కింద పడేస్తారో చివరి వరకు అంతుచిక్కదు. అయితే… ఈసారి మాజీ ఎంపీ కవితకు కేసీఆర్ షాక్ ఇస్తారా…? కన్నప్రేమను చూపించి మరోసారి అవకాశం ఇస్తారా…? అన్నది టీఆర్ఎస్‌లో ఆసక్తి రేపిస్తుంది.
లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌లో సీఎం కేసీఆర్ కూతురు ఓటమి పాలయ్యింది. దాంతో ఆమె రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తోంది. ఇటు కరీంనగర్ నుండి వరుసగా ఎన్నికవుతున్న వినోద్‌కు సైతం ఓటర్లు షాక్ ఇచ్చారు. దీంతో ఈ ఇద్దరు కీలక నేతలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చినా… వినోద్‌కు రాష్ట్ర క్యాబినెట్ స్థాయి హోదా కల్పిస్తూ ప్లానింగ్ అడ్వైజరీ చైర్మన్‌గా నియమించారు సీఎం కేసీఆర్. అయితే… 2019 ఎన్నికల తర్వాత ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం పనిచేసే నాయకుడు కరువయ్యారని టీఆర్ఎస్ మదనపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి కీలకమైన వ్యక్తిని మరోసారి ఢిల్లీ పంపాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
వచ్చే మార్చిలో రెండు రాజ్యసభ ఎంపీలు టీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది. అందులో ఒకటి కేకే పదవీకాలం ముగియనుంది. దీంతో ఆయనకు రెన్యూవల్ ఇచ్చే అవకాశం కనపడుతుండగా… రెండోది కవితకు ఇవ్వబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే… ఇప్పుడు మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా రేసులో ఉన్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. పైగా ఇద్దరు నేతలు కూడా సీఎంకు అత్యంత సన్నిహితులు కావటంతో సీఎం కేసీఆర్ ఎవరివైపు మొగ్గుచూపుతారు అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే, కవితకే ఎక్కువ అవకాశం ఉన్నట్లు కనపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ ఎంపీ కవిత ఇంతవరకు భాగం కాలేదు కనుక… అది కవితకు సానుకూల అంశంగా భావిస్తున్నారు.