దర్పల్లిలో యుద్ధ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. రాళ్ల దాడి జరిగింది. ఆఖరికి పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేశారు.
నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ వేడుకల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. దీనికి ఎంపీ అరవింద్ హాజరవుతున్నారు. అయితే.. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చూశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
వారం రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి అరవింద్ రైతులను మోసం చేశారని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరిగి రాళ్ల దాడి వరకు వెళ్లింది.
పరిస్థితి చేయి దాటిపోతుండడంతో ఇరువర్గాలను శాంతింపజేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు పరుగులు పెట్టారు. రాళ్ల దాడిలో ఎస్సై వంశీకృష్ణ తలకు గాయమైంది.