తన అనర్హత వేటుపై మొదటిసారిగా స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ..తాను భారత దేశ స్వరం కోసం పోరాడుతున్నానని, ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమని ప్రకటించారు. ‘మై భారత్ కీ ఆవాజ్ కే లియే లడ్ రహా హూ.. మై హర్ కీమత్ చుకానే కో తయ్యార్ హూ’ అని హిందీలో ట్వీట్ చేశారు. ఆయన అనర్హతను లోక్ సభ సచివాలయం ప్రకటిస్తూ .. ఆయనను కోర్టు దోషిగా ఉత్తర్వులిచ్చిన మార్చ్ 23 నుంచే ఇది అమలులోకి వస్తుందని పేర్కొంది.
హైకోర్టులు స్టే ఇస్తే తప్ప రాహుల్ ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయజాలరని కూడా ఈ నోటిఫికేషన్ వివరించింది. ఆయనపై అనర్హత వేటు వేయడాన్ని అనేకమంది విపక్ష నేతలు తీవ్రంగా ఖండించగా బీజేపీ.. కొత్త పల్లవినెత్తుకుంది.
కాంగ్రెస్ పార్టీలోనే కుట్ర వంటిది జరిగి ఉండవచ్చునని, రాహుల్ ని కోర్టు దోషిగా ప్రకటించగానే ఆ పార్టీ నేతలు కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ పై కోర్టులకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించింది. ఇటీవల కాంగ్రెస్ నేత పవన్ ఖేరాను అరెస్టు చేసినప్పుడు కొన్ని గంటల్లోనే ఆ పార్టీ వారు కోర్టుకు వెళ్లారని బీజేపీ వ్యాఖ్యానించింది.
సూరత్ కోర్టు తీర్పును కాంగ్రెస్ నేతలు తప్పు పట్టడాన్ని కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్ విమర్శిస్తూ నెహ్రూ-గాంధీ కుటుంబం ‘ఫ్యూడల్ మైండ్ సెట్’ తో ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. వారికి ప్రత్యేకంగా యేవో చట్టాలు, డెమాక్రాటిక్ సిస్టం ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇక ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ నేతలంతా తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చలకు శ్రీకారం చుట్టారు.