ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్య కారణాలతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరణించారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా ఆయన మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. 1951 జూలై 31న శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఆయన జన్మించారు.
1974లో రామరాజ్యం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత పలు సినిమాల్లో ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటించారు. సాగర సంగమం, స్వాతిముత్యం, గుప్పెడు మనసు, అభినందన, నోము, యమ కింకరుడు, అమరజీవి లాంటి హిట్ సినిమాల్లో ఆయన నటించారు.
శరత్ బాబు మరణంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆయన కుటుంబం యూపీ నుంచి ఆముదాల వలసకు వచ్చి సెటిల్ అయింది. ఆయనకు ఏడుగురు అన్నదమ్ములు, ఆరుగురు అక్కా చెల్లెలు ఉన్నారు. శరత్ బాబును ఆయన కుటుంబకులు సత్యం బాబుగా పిలుస్తారు.