మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తూ… టాలీవుడ్ సహా దక్షిణాధి భాషల్లో అందరు అగ్ర హీరోలతో సినిమా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఇప్పుడు సరైన హిట్ కొట్టలేక ఇబ్బందిపడుతున్నాడు. గతంలో దేవీశ్రీ కోసం వెంపర్లాడిన పెద్ద హీరోలు, డైరెక్టర్స్ అంతా ఇప్పటికే దేవీశ్రీని పక్కనపెట్టి… ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్‌ను తీసుకున్నారు. కానీ దేవీశ్రీకి అత్యంత ఆప్తుడు డైరెక్టర్ సుకుమార్ మాత్రం మరోసారి దేవీశ్రీ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నాడు. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోయే ఈ చిత్రానికి దేవీశ్రీ మ్యూజిక్‌కు బదులు అల్లు అర్జున్ మరోసారి థమన్‌ను తీసుకుందామని సుకుమార్‌పై ఒత్తిడి తెచ్చాడట. ఇటీవల విడుదలై సూపర్ హిట్ కొట్టిన అల వైకుంఠపురములో సినిమాకు మ్యూజిక్ ఎంతో అడ్వాంటేజ్ కావటంతో థమన్ వైపే మొగ్గుచూపాడట అల్లు అర్జున్. కానీ సుకుమార్ అనేక చర్చల తర్వాత డీఎస్పీ మ్యూజిక్‌కు ఓకే చెప్పించాడట. అయితే… ఈసారి కూడా ఫెయిల్ అయితే సుకుమార్ కూడా ఇక ఏం చేయలేడని, పెద్ద డైరెక్టర్‌తో దేవీశ్రీకి ఇదే ఆఖరి అవకాశమన్న చర్చ ఫిలింనగర్‌లో జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం దేవీశ్రీ ప్రసాద్ చేతిలో ఉప్పెనతో పాటు రంగ్ దే సినిమాలున్నాయి.