ఓవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్టును ఫైనల్ చేసింది. కానీ ఇందులో మన పేరుందా…? ఉంటే ఏ డివిజన్ లో ఉంది…? ఒక వేళ పేరున్నప్పటికీ ఏమైనా మార్పులు-చేర్పులు చేసుకోవాలి అనుకుంటే ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది.
ఆర్డీవో, తహశీల్ధార్ కార్యాలయాల్లో ఇందుకు అవకాశం కల్పించారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 15వరకు అవకాశం ఇచ్చారు. 2021, జనవరి 1 వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదుకు అర్హులు. ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులకు అవకాశం ఇస్తుంది.
నాలుగు రోజుల పాటు పోలింగ్ కేంద్రాలు, ఆర్డీవో, ఎమ్మార్వో ఆఫీసుల్లో అవకాశం ఉండగా… డిసెంబర్ 5, 6 వతేదీల్లో చివరి అవకాశం ఉందని ఎన్నికల అధికారులంటున్నారు. జనవరి 14న ఫైనల్ ఓటర్ల జాబితా విడుదల చేస్తారు.
అయితే, గ్రేటర్ ఎన్నికలున్నందున కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారికి ఈసారి అవకాశం ఉండదు. ఇప్పటికే తుది జాబితా విడుదలైనందున దాని ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి.