ఇక సినిమాలు చేయదనుకున్నారు. ఓ బిజినెస్ మేన్ తో పెళ్లయిపోతుందని ఊహాగానాలు కూడా చెలరేగాయి. బరువు తగ్గలేక సినిమాలకు దూరమైందంటూ కథనాలు కూడా వచ్చాయి. అన్నింటికీ చెక్ పెడుతూ సెట్స్ పైకి వస్తోంది అనుష్క. సోమవారం నుంచి కొత్త సినిమాను స్టార్ట్ చేయబోతోంది.
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క, లేటెస్ట్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో యు.వి.క్రియేషన్స్ ఓ సినిమా అనౌన్స్ చేశారు. ఇది అనుష్కకు 48వ సినిమా. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు చేసింది ఈ బ్యూటీ. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి.. 2018లో లేడీ ఓరియెంటెడ్ భాగమతి సినిమాలను యు.వి.క్రియేషన్స్ నిర్మించారు. ఈ రెండు సినిమాలు మంచి విజయాలు సాధించాయి.
భాగమతి సినిమా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఒకేసారి విడుదలై అద్భుతమైన విజయం అందుకుంది. ఇందులో తనదైన నటనతో అందరినీ మెప్పించింది అనుష్క శెట్టి. ఇప్పుడు మూడోసారి అనుష్క యు.వి.క్రియేషన్స్ కలిసి సినిమా చేస్తున్నారు. నవీన్ పొలిశెట్టి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. దర్శకుడు మహేష్ బాబు న్యూ ఇమేజ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.