కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌ను ఈ రోజు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో ఫార్మా, హెల్త్ కేర్ సెక్టార్‌కు సంబంధించి పలు పథకాలను ఆమె ప్రకటించారు. 2014 నుంచి ఉన్న 154 మెడికల్ కాలేజీలకు తోపాటు కొత్తగా 157 నూతన నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
దేశంలోని 102 కోట్ల మందికి 220 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు ఆమె పేర్కొన్నారు. 2024 వరకు దేశంలో సికిల్ సెల్ ఎనీమియాను తొలగించేందుకు మిషన్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దీని కింద దేశంలోని గిరిజన ప్రాంతాల్లో 0-40 ఏండ్ల మధ్య వయసున్న 7 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు.
ఎంపిక చేసిన ఐసీఎంఆర్ ల్యాబ్‌ల్లో సౌకర్యాలను ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సదుపాయాల ద్వారా పరిశోధన కోసం అందుబాటులో తీసుకువస్తామన్నారు. భవిష్యత్ వైద్య సాంకేతికతలు, అత్యాధునిక తయారీ, పరిశోధనల కోసం నైపుణ్యం కలిగిన మానవశక్తి లభ్యతను నిర్ధారించేందుకు వైద్య పరికరాల కోసం మల్టీడిసిప్లినరీ కోర్సులకు ప్రస్తుత సంస్థల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు.
అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మూడు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ప్రముఖ పరిశ్రమల సంస్థలు పలు శాఖల్లో పరిశోధనలు నిర్వహించడం, అత్యాధునిక అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడంలో భాగస్వాములవుతాయన్నారు.