ఈ తొమ్మిదేళ్లలో భారత ఆర్ధిక వృద్ధి రేటు పదో స్థానం నుంచి ఐదో స్థానానికి పెరిగిందని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రభుత్వం చేబట్టిన పథకాలను పటిష్టంగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యపడిందన్నారు. 2023-24 సంవత్సరానికి గాను బుధవారం పార్లమెంటులో బడ్జెట్ ను సమర్పిస్తూ ఆమె.. గత తొమ్మిదేళ్లలో ప్రజల తలసరి ఆదాయం బాగా పెరిగిందన్నారు. ఆర్ధిక వృద్ధి రేటు 7 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నామని, మన ఎకానమీ వృద్ధిని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని ఆమె చెప్పారు.
‘వాంఛితో కో వరియతా’ అనే పదాన్ని పేర్కొన్న ఆమె.. మనం తలచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదన్నారు. దేశంలో రైతులు, పరిశ్రమల వంటి వివిధ రంగాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం సాగుతోందని, కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలు వారి ప్రయోజనాలకు దోహదపడుతున్నాయని చెప్పారు. వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
వ్యవసాయ రంగంలో సవాళ్ళను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. కరవు ప్రాంత రైతులకు 5 వేల కోట్లకు పైగా నిధులను కేటాయిస్తున్నామన్నారు. చిరు ధాన్య రైతులకు ప్రోత్సాహకంగా శ్రీ అన్న నిధి పథకాన్ని తెచ్చామన్నారు. పశుగణాభివృధి, పాడి పరిశ్రమల ఊతానికి వ్యవసాయ రుణ సంబంధ టార్గెట్ ను 20 లక్షల కోట్లకు పెంచుతున్నామని ఆమె ప్రకటించారు.
సమాజంలోని దళితులు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ఈ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధి లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. దీన్ని ‘అమృత్ కాల్’ బడ్జెట్ గా ఆమె అభివర్ణించారు. పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని పీఎం ఆవాస్ యోజన కింద కేటాయింపులను 66 శాతానికి అంటే 79 వేల కోట్ల మేర పెంచినట్టు ఆమె చెప్పారు. ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రసంగ ప్రభావంతో సెన్సెక్స్ అప్పుడే 600 పాయింట్లు పెరిగింది.