దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు రేసు గుర్రాల్లా పరుగులు పెడుతూనే ఉన్నాయి. వరుసగా 12వ రోజూ చమురు కంపెనీలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి. ఇప్పటికే పలు నగరాల్లో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది కూడా. ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా రేపో, మాపో వందను దాటేయబోతోంది. వరుసగా వాతపెడుతుండటంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా కేంద్రంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో పెట్రోల్ ధర తగ్గింపునకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ సలహా ఇచ్చారు.
పెట్రోల్ రిటైల్ ధరలు సహేతుకమైన (రీజనేబుల్) స్థాయికి తగ్గాలంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంప్రదింపులు జరిపాలని, తగ్గింపై చర్చలు జరపాలని ఆమె అభిప్రాయపడ్డారు. వినియోగదారులు ఊరట కలగాలంటే ఇంధన ధరలు తగ్గించడమే సరైన చర్య అని అన్నారు. మరోవైపు పెట్రో ధరలు వరుసగా పెరుగుతుండటంపై దేశవ్యాప్తంగా వాహనదారుల్లో ఆందోళన నెలకొంది.