‘కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖలో ఓ ‘ఇంటిదొంగ’ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ శాఖలోని కీలక సమాచారాన్ని ఓ ఉద్యోగి తన ఫోన్ ద్వారా విదేశాలకు చేరవేస్తున్నాడట.. ఇది గూఢచర్యమేనని, ఈ నెట్ వర్క్ ని ఛేదించామని ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు.
కాంట్రాక్టు పధ్దతిన డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్నఈ ఉద్యోగిని సుమిత్ గా గుర్తించారు. ఇతని ఫోన్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇతడిపై అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు.
కేంద్ర పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ఇతగాడు ఈ శాఖలోని డేటాను లీక్ చేయడాన్ని తీవ్రమైన చర్యగా భావిస్తున్నారు. 2023-24 సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1 న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంటుకు సమర్పించనున్నారు.
అయితే సుమిత్.. ఏయే అంశాలను విదేశాలకు చేరవేశాడన్నది తెలియలేదు. కీలకమైన ఆర్ధిక శాఖలో ‘ఇంటిదొంగ’ ఉండడం ఈ శాఖ అధికారులను కలవరపరుస్తోంది. ఇతని వెనుక మరెవరైనా ఉద్యోగులున్నారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.