ప్రభుత్వ బండి నడిపేందుకు ఆర్థిక క్రమశిక్ష ఎంతో అవసరం అని నిపుణలు హెచ్చరిస్తూనే… తెలంగాణలో అది ఏమాత్రం లేదన్న ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. ధనిక రాష్ట్రం అంటూ కేసీఆర్ ఎదురుదాడికి దిగటంతో విమర్శించే వాళ్లు కూడా సైలెంట్ అయ్యారు. కానీ కరోనా లాక్ డౌన్ తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా వృధా ఖర్చులు తగ్గించుకుందాం అంటూ ప్రకటన చేశారు. రాబడి తగ్గిపోవటంతోనే కేసీఆర్ ఆ పాట పాడారు అన్న విమర్శలు కూడా వచ్చాయి.
కరోనాతో రాబడి తగ్గింది. డబ్బులేక జనం మందుకు జర దూరం జరగటంతో ఎక్సైజ్ ఆదాయం అనుకున్నంతగా లేదు. కష్టాల్లో ఆదుకునే రియల్ రంగాన్ని ధరణి, ఎల్.ఆర్.ఎస్ అంటూ రుపాయి రాకుండా చేశారు. పైగా రెగ్యూలర్ గా ఇచ్చే సంక్షేమ పథకాలకు డబ్బు కావాల్సిందే. అందుకే తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు విషయంలో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.
భూస్వాములకు రైతుబంధు ఎందుకు… చిన్న, సన్నకారు రైతులకు ఇస్తే సరిపోతుంది కదా అని విమర్శలొచ్చినా వెరవని సీఎం కేసీఆర్ ఇప్పుడు మాత్రం రైతుబంధును మొదట ఎకరం లోపు రైతులకే ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. దశల వారీగా ఇతర రైతులకు రైతుబంధును వేయనున్నట్లు తెలుస్తోంది. గల్లా పెట్టె ఖాళీ కావటంతోనే కేసీఆర్ సర్కార్ ఇలా దశల వారీగా అంటూ ఆలోచనలు చేస్తుందని, ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తే భవిష్యత్ కష్టమన్న హెచ్చరికలకు ఇది ఉదాహరణ అంటూ పలువురు మేధావులు, నాయకులు మండిపడుతున్నారు. ప్రజలను గారఢీ చేయటం కాదు దూరదృష్టితో కూడా వ్యవహరిస్తేనే రాష్ట్రం సుభీక్షంగా ఉంటుందని సూచిస్తున్నారు.