మనిషికి సంతోషం అన్నది ఓ వరం..సంతోషం సగం బలం అన్నది కూడా ఓ నానుడి ! జీవితంలో సంతోషమన్నది ఉంటే రోజూ పండగే ! ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాలేమిటని ఆరా తీస్తే ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. మార్చి 20 వ తేదీని అంతర్జాతీయ ఆనంద దినోత్సవంగా పాటిస్తున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి గ్లోబల్ సర్వే నిర్వహించింది. ఈ డేటా ఆధారంగా ఈ ఏడాదికి గాను విడుదల చేసిన నివేదికలో ఫిన్లాండ్ ఇలా మొదటి స్థానం ఆక్రమించింది. 150 దేశాల్లోని డేటాను పరిగణన లోకి తీసుకుని జాబితాను రూపొందించింది. అతి చిన్న దేశమైన ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలవడం వరుసగా ఇది ఆరోసారి.
ఆ తరువాతి స్థానాల్లో డెన్మార్క్, ఐస్ ల్యాండ్, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్ నిలిచాయి. గత మూడేళ్ళ కాలంలో ఆయా దేశాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు, శారీరక, మానసిక ఆరోగ్యం. కుటుంబ జీవనం, జీడీపీ, సామాజిక వ్యవస్థ, అవినీతి అదుపు వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. కోవిడ్ పరిస్థితుల అనంతరం చాలావరకు ప్రజల్లోఒకరికొకరు సాయం చేసుకోవడం,అపరిచితులు సైతం మద్దతుగా నిలవడం పెరిగిందని ఈ నివేదికను రూపొందించినవారిలో ఒకరైన జాన్ హెల్లీ వెల్ తెలిపారు.
2021 లో ఈ పరిస్థితి మరింత మెరుగు పడిందన్నారు. ఇక ఈ జాబితాలో ఇండియా 125 వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 136 వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 11 స్థానాలు మెరుగుపరచుకోవడం విశేషం. పొరుగు దేశాలైన చైనా 74 వ స్థానంలో ఉండగా 119 వ స్థానంలో నేపాల్, 63 స్థానంలో శ్రీలంక, 102 వ స్థానంలో బంగ్లాదేశ్ ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా 15 వ స్థానం లో ఉండగా రష్యా 72 లోను, ఉక్రెయిన్ 92 వ స్థానం లోను ఉన్నాయి.
ఐరాస లోని ‘సస్ టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్’ ‘.వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’ పేరిట దీన్ని విడుదల చేసింది. సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న దేశాల కంటే ఇండియాలో సంతోషం తక్కువగా ఉందా అంటూ ఈ నివేదికను ప్రశ్నిస్తున్నవారూ ఉన్నారు. ఉదాహరణకు శ్రీలంక వంటి దేశాలున్నాయి. ఇక సంతోషం అస్సలు లేని దేశంగా ఆఫ్ఘనిస్తాన్ ను ఈ నివేదిక పేర్కొంది.