బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిపై యూపీ పోలీసులు దోపిడి, దొంగతనం, దాడి కేసు నమోదు చేశారు. దాడి చేసి తన దగ్గర ఉన్న డబ్బు లాక్కెళ్లారని శ్యామ్ బహదూర్ సింగ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫైజాబాద్‌లోని కొత్వాలి సిటీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సోమవారం అర్థరాత్రి నలుగురు వ్యక్తులు వాహనంలో వచ్చి తనపై దాడి చేశారని సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య జిల్లా ఖండసా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌నగర్ గ్రామానికి చెందిన శ్యామ్ బహదూర్ సింగ్.. రుడౌలీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రామ్ చంద్ర యాదవ్ కుమారుడు అలోక్ యాదవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం అర్థరాత్రి నలుగురు వ్యక్తులు వాహనంలో వచ్చి.. తనని క్రూరంగా కొట్టారని, వారిలో ఒకరు తనపైకి తుపాకీ గురిపెట్టి కాల్చివేస్తానని బెదిరించినట్లు పేర్కొన్నాడు. ఆ నలుగురు వ్యక్తులు వచ్చిన వాహనాన్ని రుదౌలీ బీజేపీ ఎమ్మెల్యే రామ్ చంద్ర యాదవ్ కుమారుడు అలోక్ యాదవ్ నడుపుతున్నాడని ఆయన ఆరోపించాడు. అంతేకాదు, రూ. లక్ష నగదు, కొన్ని పత్రాలు ఉన్న బ్యాగ్‌ను లాక్కెళ్లారని, తాను గట్టిగా అరిచేసరికి జనం గుమిగూడారని, ఆ జనాన్ని చూసి దుండగులు పారిపోయారని చెప్పాడు. ఈ ఘటన అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయిందని ఆయన ఫిర్యాదులో తెలిపాడు.
“సోమవారం రాత్రి అలోక్ యాదవ్ సహా మొత్తం నలుగురు ఓ వాహనంలో వచ్చారు. నన్ను తీవ్రంగా కొట్టారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీ పెట్టి కాల్చేస్తామని బెదిరించారు. నా దగ్గర ఉన్న రూ.లక్ష నగదుతో ఉన్న సంచిని, కొన్ని దస్త్రాలను లాక్కున్నారు. నేను గట్టిగా అరిచేసరికి సమీపంలోని ప్రజలు వచ్చారు. వెంటనే అలోక్, అతడి అనుచరులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.” అని ఫిర్యాదులో పేర్కొన్నాడు శ్యామ్.
కాగా, తనపై మరోసారి దాడి జరిగి ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు, తన కుటుంబానికి ఏమైనా జరిగితే ఎమ్మెల్యే రామ్ చంద్ర యాదవ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. ఇక ఈ ఘటనపై మంగళవారం సాయంత్రం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని అయోధ్య పోలీస్ ఆఫీసర్ తెలిపారు.