ఎల్జేపీ(లోక్ జనశక్తి పార్టీ ) ఎంపీ ప్రిన్స్ రాజ్ పాశ్వాన్‌పై ఢిల్లీలో రేప్ కేసు నమోదైంది. మూడు నెలల క్రితం బాధితురాలు ఫిర్యాదు చేయగా, ఢిల్లీ కోర్టు సూచనల మేరకు తాజాగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీహార్‌లోని సమస్తిపూర్ నియోజకవర్గ నుంచి ఎంపీగా ఉన్నారు ప్రిన్స్ రాజ్ పాశ్వాన్. అలాగే పార్టీ బీహార్ యూనిట్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.
ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న వివరాల మేరకు.. 2019లో ఎల్జేపీలో చేరిన మహిళా నేతను.. ప్రిన్స్ రాజ్ మొదటిసారి ఢిల్లీలోని జనపథ్‌లోని వెస్ట్రన్ కోర్టులో జనవరి 2020 లో కలిశారు. అక్కడ ఆయన బాధితురాలితో కలిసి మద్యం సేవించిన తర్వాత లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దాన్ని వీడియోగా చిత్రీకరించి తరచూ బాధితురాలి ఇంటిని వెళ్లడం, లైంగికంగా వేధించడం చేసేవారు.
వేధింపుల విషయం గురించి పార్టీ సీనియర్ లీడర్ చిరాగ్ పాశ్వాన్‌ను కలిసి వివరించానని, పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారని బాధితురాలు గుర్తు చేసింది. కేసు పెట్టవద్దని తనను ఒప్పించినట్టు చెప్పింది. కానీ ఇంతవరకు ప్రిన్స్ రాజ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎఫ్ఐఆర్‌లో ఆరోపించింది. ఆ తర్వాత తాను పార్టీ నుంచి బయటకు రాగా.. 2020 ఫిబ్రవరిలో ప్రిన్స్ రాజ్ తనను 14 గంటలకు పైగా అక్రమ నిర్బంధంలో ఉంచారని, పోలీసులతో కుమ్మక్కై, తనకు వ్యతిరేకంగా ఉన్న అన్ని ఆధారాలను నాశనం చేశారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.