బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె శృతీరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేశారు బంజారా హిల్స్ పోలీసులు. ఎలీషాబాబు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.
బంజారా హిల్స్ లో నిర్మాత, వైసీపీ నేత పీవీపీ.. కాంపౌండ్ వాల్ విషయంలో తమను శృతీరెడ్డి దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఎలీషా బాబు. పోలీసులకు పక్కా ఆధారాలు సమర్పించాడు.
ఇంటి గోడ విషయంలో పీవీపీ, శృతీరెడ్డి మధ్య వివాదం చాలా రోజుల నుంచి నడుస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లో పర్వత్ విల్లాస్ పేరుతో పీవీపీ రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. ఆ గేటెడ్ కమ్యునిటీలో శృతీరెడ్డి విల్లా కొనుగోలు చేశారు. ఇంటి మరమ్మతుల్లో భాగంగా ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టారు. అయితే పీవీపీ అనుచరులు బాలాజీతోపాటు మరికొందరు అక్కడికి చేరుకొని జేసీబీతో కూల్చివేసినట్టు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనతో సహా మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
అయితే శృతిరెడ్డి ఆరోపణలను పీవీపీ ఖండించారు. తాము చట్ట ప్రకారమే నడుచుకొంటున్నామని తెలిపారు. ఇందులో తమ తప్పేమీ లేదని చెప్పారు. ఈ వివాదం నడుస్తుండగా.. అదే ప్రహరీ గోడ విషయంలో తమను దూషించారని ఎలీషాబాబు.. శృతీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా కోర్టు ఆదేశాలతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.