కలకలం రేపిన బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.
ఈ కేసులో మొత్తం నలుగురిని ఎఫ్‌ఐఆర్ లో నిందితులుగా చేర్చారు బంజారాహిల్స్ పోలీసులు. అనిల్ కుమార్, అభిషేక్ ఉప్పాల, కిరణ్ రాజ్, వీరమాచినేని అర్జున్ ల పేర్లను నమోదు చేశారు. అయితే.. అర్జున్, కిరణ్ రాజ్ పరారీలో ఉన్నారు. వాళ్లిద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఆదివారం ఉదయం ర్యాడిసన్ బ్లూ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో టాస్క్ ఫోర్స్ సోదాలు జరపగా డ్రగ్స్ బయటపడ్డాయి. 5 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు. పబ్ యజమానులు అభిషేక్, అనిల్ ను రిమాండ్ కు తరలించగా.. పరారీలో ఉన్న అర్జున్, కిరణ్ రాజ్‌ల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
వీరంతా ఆగస్టు నుంచి పబ్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా తప్పకుండా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. నగరంలోని బార్స్, పబ్స్ పై నిఘా పెంచారు.