ఓ చమురు శుద్ధి కర్మాగారంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ప్రాణ నష్టం భారీగా జరగడమే కాకుండా.. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. ఈ ఘటన ఆఫ్రికన్ దేశం నైజీరియాలో చోటుచేసుకుంది.
నైజీరియాలో దక్షిణ రాష్ట్రమైన ఇమోలోని ఓ అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో.. శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 100 మందికి పైగా కార్మికులు సజీవదహనం అయ్యారు. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన అనేక మృతదేహాలు నేలపై పడి ఉన్నాయి. అలాగే, పలువురు మంటల్లో కాలిపోయి బూడిదయ్యారని.. అందువల్ల ఎంత మంది మరణించారన్న దానిపై ఖచ్చితమైన లెక్కలు లేవని స్థానిక అధికారులు వెల్లడించారు.
అయితే, సిబ్బంది అంతా తమ తమ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అక్కడికక్కడే చాలా మంది మరణించారు. కొందరు ప్రాణ భయంలో బయటకు పరుగులు చేశారు. చెట్లు ఎక్కి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. చెట్ల కొమ్మలకు శవాలు వేలాడుతూ కనించాయని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.
ఈ ఘటన రివర్స్, ఇమో స్టేట్ మధ్య సరిహద్దులో జరిగిందని రివర్స్ స్టేట్ పోలీస్ ప్రతినిధి గ్రేస్ ఇరింగే కోకో తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రమాదానికి కారణమైన చమురు శుద్ధి కేంద్రం యజమాని కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.
నైజీరియాలో ఉద్యోగాలు దొరక్క చాలామంది యువత చమురు శుద్ధి కేంద్రాలను అక్రమంగా ఏర్పాటు చేస్తుంటారు. ఈ తరహా అక్రమ చమురు శుద్ధి కర్మాగారాలు దేశంలో చాలానే ఉన్నాయి. పైప్‌లైన్స్ ధ్వంసం చేసి దొంగిలించే ముడి చమురును ఇలాంటి వాటిలో శుద్ధి చేసి విక్రయిస్తుంటారు. ఆ సందర్బంగా తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి.