తెలంగాణ రాష్ట్రంలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. డెక్కన్ మాల్ లో సంభవించిన అగ్నిప్రమాద ఘటన తర్వాత వరుసగా సికింద్రాబాద్లోనూ, నిన్న బాగ్ లింగంపల్లిలోనూ, ఈరోజు ఉదయం తెలంగాణ కొత్త సెక్రటేరియట్ లోను అగ్ని ప్రమాద ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా వరంగల్లోనూ భారీ అగ్నిప్రమాద ఘటన చోటు చేసుకుంది.
వరంగల్ ఇసుక అడ్డా కూడలిలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాత దర్వాజాలు, కిటికీలు విక్రయించే దుకాణాలకు చెందిన ఒక గోడౌన్ లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం జరిగిన గోడౌన్ లో చాలా ఫర్నీచర్ మెటీరియల్ ఉంది. బాగా ఎగసి పడిన మంటలు ఎక్కడ తమ కాలనీకి వ్యాపిస్తాయో అని చుట్టుపక్కల ఉన్నవారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పాత దర్వాజాలు, కిటికీల దుకాణాలకు చెందిన గోడౌన్లో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ఫర్టిలైజర్ షాప్ కు, ఓ ద్విచక్ర వాహనాలు రిపేర్ చేసే షాపుకు అంటుకోవడంతో చుట్టుపక్కల ఉన్న నివాసాలలోని వారు ఆందోళనకు గురయ్యారు.
దట్టమైన పొగ అంతట వ్యాపించడంతో ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. ఇక భారీ ప్రమాద నేపథ్యంలో అగ్ని ప్రమాద సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. సుమారు 12 ఫైర్ ఇంజన్ల ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. యుద్ధ ప్రాతిపదికన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది.
అయితే ఈ అగ్నిప్రమాద ఘటనలో మొత్తం కోటి రూపాయలు విలువైన ఫర్నిచర్ దగ్ధమైనట్టుగా వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. ఈ ఘటనపై వరంగల్ ఏసిపి గిరి కుమార్ కలకోట కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.