హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ గ్రాండ్ స్పైసీ బావర్చి హోటల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారి హోటల్ రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. అలా ఆ మంటలు మూడో అంతస్తుకూ వ్యాపించాయి.
రెండో అంతస్తులోని బావర్చి హోటల్‌తో పాటు మూడో అంతస్తులోని యాక్షన్ గార్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసులోనూ భారీగా మంగలు ఎగిసిపడ్డాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు, పోలీసు అధికారులు ఆ ఆఫీసులో ఉన్న సిబ్బందిని సురక్షితంగా కిందకు తరలించారు.
నాలుగు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. మంటల ధాటికి హోటల్ నుంచి సిబ్బంది, కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. మంటల్లో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో 15 మంది సిబ్బంది ఉన్నట్లు హోటల్ యాజమాన్యం తెలిపింది. మంటల వలన దట్టమైన పొగ వ్యాపించింది. దాంతో సిబ్బంది ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. వెంటనే వారికి ప్రాథమిక చికిత్స అందించారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.