ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల్లో బస్సు బూడిదైపోయింది. అయితే, డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. క్షణం ఆలస్యమైన పెను ప్రమాదమే జరిగేది. ఈ ఘటన మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.
నాగ్‌పూర్‌లోని మెడికల్ చౌక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న సిటీ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. పొగలు రావటం గమనించిన డ్రైవర్ అప్రమత్తమై.. బస్సును రోడ్డు పక్కకు ఆపి ప్రయాణికులను దించేశాడు. ఆ మరు నిమిషమే బస్సు అంత మంటలు చెలరేగి, బస్సు పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి హానీ జరగలేదు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.
అయితే, షార్ట్ సర్య్కూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కాగా, నాగ్‌పూర్‌లో నెల రోజుల్లోనే ఇలాంటి ఘటనలు రెండు చోటుచేసుకోవడం కలకలం రేపుతుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగానే షార్ట్ సర్క్కూట్ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పట్టణంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిందని, సరాసరిగా 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.