ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం గుజరాత్ రాష్ట్రంలోని భూచ్ జిల్లాలో చోటుచేసుకుంది.
అహ్మదాబాద్ నగరానికి 235 కిలోమీటర్ల దూరంలోని దహేజ్ పారిశ్రామిక ప్రాంతంలోని.. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. దీంతో క్షణాల్లో ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించాయి. ప్రమాదం సమయంలో రియాక్టర్ వద్ద పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు మంటల్లో చిక్కుకొని మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక వాహనాలను రప్పించి మంటలను అదుపు చేశామని భారుచ్ జిల్లా ఎస్పీ లీనా పాటిల్ చెప్పారు. మంటలు ఆర్పిన అనంతరం మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. మరోవైపు, గతేడాది ఆగస్టులో కూడా ఇదే పారిశ్రామిక వాడలోని మరో రసాయన కంపెనీలో పేలుడు సంభవించింది. ఆ ఘటనలో ఓ కార్మికుడు దుర్మరణం చెందగా, ఇద్దరు గాయపడ్డారు.