హైదరాబాద్‌లో తాజాగా మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హకీంపేటలో సిలిండర్లు పేలి మంటలు అంటుకున్నాయి. సాలార్ జంగ్ బ్రిడ్జి సమీపంలో వెల్డింగ్ పనులు చేస్తుండగా ఐదు సిలిండర్లు పేలాయి.
దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో చుట్టు పక్కల వాళ్లు భయాందోళనలకు గురయ్యారు వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టమూ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మొదట రెండు సిలిండర్లు పేలినట్టు తెలుస్తోంది. ఘటనను స్థానికులు చిత్రీకరిస్తున్న సమయంలో మరో మూడు సిలిండర్లు పేలినట్టు సమాచారం. ఘటనపై ఫైర్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటనపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అక్రమంగా పెద్ద సిలిండర్ల నుంచి గ్యాస్‌ను చిన్న సిలిండర్లలోకి నింపుతుండగా ఘటన జరిగివుంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.