హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కేపీహెచ్‌బీ నిజాంపేట రోడ్డులోని శ్రీశ్రీ హోలీస్టిక్ ఆస్పత్రి మొదటి అంతస్తులో అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. సిబ్బంది సమాచారంతో నాలుగు ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి.
ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులతోపాటు, వైద్య సిబ్బంది కూడా పరుగులు పెట్టారు. ఐసీయూ వార్డులోని బాధితులను సెక్యూరిటీ గార్డులు భుజాలపై వేసుకుని బయటికి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన అంతస్తులో 30 మందికిపైగా రోగులున్నట్టు సమాచారం.
ఆస్పత్రిలోని రోగులను హుటాహుటిన అంబులెన్స్‌లో వేరే ఆస్పత్రులకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్యూట్ కారణమని అనుమానిస్తున్నారు.