హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా సికింద్రాబాద్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిత్యం రద్దీగా వుండే స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్ మూడో అంతస్తులో భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి.
స్థానికులు సమాచారాన్ని అధికారులకు అందజేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చీకటిగా ఉండడంతో లైట్లు వేసుకుని సిబ్బంది నివారణ చర్యలు చేపడుతున్నారు.
భవనం లోపల కొందరు చిక్కుకున్నట్లు సమాచారం అందడటంతో సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. టార్చ్ లైట్ల సహాయంతో భవనంలోకి వెళ్లారు. భవనంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు క్రేన్లను తీసుకు వచ్చి సహాయక చర్యలు మొదలు పెట్టారు.
భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కాంప్లెక్స్ రెండో వైపు ఉన్న కార్యాలయాల్లో నాలుగు, ఐదు, ఆరు అంతస్తుల్లో ఉద్యోగులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.
భవనం లోపలి నుంచి ఇప్పటివరకు ఏడుగురిని రక్షించారని చెప్పారు. లోపల ఎంతమంది ఉన్నారనేదానిపై స్పష్టమైన సమాచారం లేదన్నారు. సహాయక చర్యలు వేగవంతం చేశామని వెల్లడించారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తోందన్నారు.