సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20కోట్ల మేర నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడుతూ.. క్లబ్ అంతటా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. దీంతో స్థానికులు భయాదోళనలకు గురై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సంఘటనా స్థలాన్ని చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. మొత్తం 10 ఫైర్ ఇంజన్లలో సాయంతో మంటలు ఆర్పారు. పది ట్యాంకర్లతో గంట సమయం శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా.. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.
సుమారు 20 కోట్ల ఆస్తి నష్టపోయినట్టు క్లబ్ అదికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు, దట్టమైన పొగలు చూసి పరుగులు తీశామని స్థానికులు చెబుతున్నారు.
సికింద్రాబాద్ క్లబ్ కి ఓ ప్రత్యేకత ఉంది. దీన్ని బ్రిటీష్ కాలంలో 1878లో మిలిటరీ అధికారుల కోసం నిర్మించారు. భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి 2017లో సికింద్రాబాద్ క్లబ్ పోస్టల్ కవర్ విడుదల చేశారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్లబ్ ఉంది. సికింద్రాబాద్ క్లబ్‌లో 300 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఈ క్లబ్‌లో 5 వేల మందికి పైగా సభ్యత్వం ఉంది.