తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సచివాలయంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో గుమ్మటంపై భారీగా పొగలు వ్యాపించాయి. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సచివాలయంలో వుడ్ వర్క్ నడుస్తోంది. ఈ క్రమంలోనే మంటలు వచ్చినట్టు సమాచారం.
నూతన సచివాలయంలో ఎలాంటి నష్టం సంభవించలేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 17న కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ సభకు కౌంటర్‌గా బీఆర్ఎస్ పార్టీ ఈ సభను నిర్వహించనున్నది. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం, స్టాలిన్, జార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, కుమారస్వామి హాజరు కానున్నారు.