– అనుమతుల్లేని నిర్మాణాలు..
– గాల్లో కలుస్తున్న ప్రాణాలు
– అక్రమాలపై హైపవర్ కమిటీ
– భవనాల విషయంలో మంత్రి తలసాని వార్నింగ్
– మరి.. అమాత్యుడి కుమార్తె ఆస్పత్రికి అనుమతి ఉందా?
– 25 ఏళ్ల పాత భవంతిపై అదనంగా 4 అంతస్తులు
– అడుగడుగునా పొంచి వున్న ప్రమాదం
– రోగుల ప్రాణాలకు గ్యారంటీ ఏది?
– పీఆర్కే ఆస్పత్రిపై తొలివెలుగు స్టింగ్ ఆపరేషన్!
క్రైంబ్యూరో, తొలివెలుగు:తండ్రి మంత్రి అయితే నిబంధనలు అంతా తూచ్. పాతికేళ్ల క్రితం నిర్మించిన పాత బిల్డింగ్ పై ఎలాంటి అనుమతులు అవసరం లేకుండా మరో నాలుగు అంతస్తులు లేపేయొచ్చు. 200 పడకల ఆస్పత్రికి ఒక్క టూవీలర్ పెట్టుకునే పార్కింగ్ లేకుండానే పర్మిషన్స్ వచ్చేస్తాయి. 100 మీటర్ల పొడవు ఉన్న భవంతికి చీమ దూరేంత గల్లీ కూడా లేకపోవడం కలవర పెడుతోంది. ఇటీవల సికింద్రాబాద్ లో జరిగినట్లే అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. ఎలాంటి సెట్ బ్యాక్ లు లేకుండా సెల్లార్ తో కలిపి 9 అంతస్తులు నిర్మించి అది ఆస్పత్రి కోసం వినియోగించడం ఒక్క మంత్రి తలసాని కుటుంబానికే చెల్లుతుంది. అక్రమ నిర్మాణాలపై హైపవర్ కమిటీ వేసి సమావేశం అయ్యారు కదా..? రండి ఇక్కడి నుంచే కమిటీ పనితీరు ఏంటో తేల్చేద్దాం. అధికారంతో అక్రమంగా నిర్మించి బిడ్డకు గిఫ్ట్ గా ఇచ్చిన భవంతికి ఎలాంటి అనుమతులు ఉన్నాయో తొలివెలుగు క్రైంబ్యూరో స్టింగ్ ఆపరేషన్ చేసింది. నిర్మాణం ఎలా ఉందో అందులో ఏం నడిపిస్తున్నారో సీక్రెట్ కెమెరాలో బంధించింది.
2019లోనే ఫిర్యాదులు
చందానగర్ పీఆర్కే ఆస్పత్రి భవనంలో 2016 వరకు మైత్రి హాస్పిటల్ నడిపించేవారు. ఆ తర్వాత ఆ ఆదాయంపై కన్నేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం హాస్పిటల్ ను వేరే చోటుకు తరలించారు. వారి ఓన్ బిల్డింగ్ లో రేడియాలజిస్ట్ అయిన అల్లుడికి ఎలాంటి అనుమతులు లేకుండానే పక్కనే ఉన్న 500 గజాలను కొనుగోలు చేసి మొత్తం 1000 గజాలకు పైగా నాలుగు అంతస్థులు ఉన్న 25 ఏళ్ల పురాతన భవనానికి మరింత మెరుగులు దిద్దారు. మంత్రి తన పవర్ తో మరో నాలుగు అంతస్తులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మించారు. అసలు ఆ భవనానికి అనుమతులు ఇవ్వరు. ఇచ్చినా సెట్ బ్యాక్ అంటూ పార్కింగ్ అంటూ.. 500 గజాలు పోతుంది. రోడ్డు ఫేజ్ 40 ఫీట్లతో 300 ఫీట్ల పొడవు చుట్టూ బిల్డింగ్ లు ఉన్నాయి. రూల్స్ ప్రకారం నిర్మాణం చేస్తే అక్కడ హాస్పిటల్ కి ఛాన్సే ఉండదు. కానీ, అల్లుడు పుట్టా రవి కుమార్ కు కార్పొరేట్ హాస్పిటల్ కావాలంటే ఏం ఆలోచించకుండానే 8 అంతస్తుల భవనాన్ని రెడీ చేశారు. అది సరిపోవడం లేదని సెల్లార్ లో విద్యుత్ పరికరాలు, 200 మంది రోగులకు సరిపోయే అక్సిజన్, బయో వేస్టేజీ, చెత్తా చెదారానికి నిలయంగా మార్చేశారు. మరిన్ని రూంలు నిర్మించారు.
చుట్టూ ఫైరింజన్ తిరిగేంత జాగా లేకపోయినా, కనీసం సెల్లార్ కు వెళ్లేందుకు కూడా అవకాశం లేదు. ఫుట్ పాత్ ను కబ్జా చేసి రోడ్డు పైనే ట్రాన్స్ ఫార్మర్ నిర్మించారు. అది కనిపించకుండా పెన్సింగ్ వేశారు. ఇక ఎమర్జెన్సీ దారి కోసం అంటూ 8 అంతస్తులకు ఇనుప వంతెనను తయారు చేశారు. ఆ పక్కనే వాస్తుకు స్థలం మిగిలితే అక్కడ స్పోర్ట్స్ షాపు పెట్టించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా నిర్మించారు. వీటన్నింటిపై 2019లోనే జనంకోసం అనే స్వచ్చంధ సంస్థ జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసింది. అధికారులు మంత్రి ఒత్తిళ్లతో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ అక్రమ బిల్డింగ్ ను రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
అగ్ని ప్రమాదాలపై తలసాని ఫైర్
సికింద్రాబాద్ డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదంపై బీజేపీకి, బీఆర్ఎస్ మధ్య యుద్ధమే నడిచింది. కిషన్ రెడ్డికి తలసాని శ్రీనివాస్ సవాళ్లు విసిరారు. 25 వేల భవనాలు ఇల్లీగల్ ఉన్నాయి. రెగ్యులరైజేషన్ చేసుకుంటారని సెలవిచ్చారు. ప్రమాదాలు పొంచి ఉన్న భవంతులను గుర్తించేందుకు మున్సిపల్ కమిషనర్ అరవింద్ కుమార్ తో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం జరిగినప్పటి నుంచి నగరంలో మూడు అగ్ని ప్రమాదాలు జరిగాయి. రూ.4 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. వాటి వద్దకు వెళ్లి మంత్రి కఠిన చర్యలు ఉంటాయని మీడియా ముందు చెప్పడమే తప్ప.. తన కూతురు, అల్లుడు డైరెక్టర్లుగా ఉన్న ఆస్పత్రి భవంతి ప్రమాదపుటంచుల్లో ఉందని తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు. ఫైర్ సేఫ్టీలు భారీగానే పెట్టినా, అసలు ఫైర్ డిపార్ట్ మెంట్ నుంచి ఫైనల్ అనుమతి లేదని తెలుస్తోంది. ఎక్కడైనా జరగరాని ప్రమాదం జరిగితే.. 200 మంది రోగులు, అటెండర్స్, సిబ్బంది, డాక్టర్స్ ప్రాణాలు కాపాడటం కష్టతరం అవుతుంది. ఇప్పటికే పార్కింగ్ ప్రదేశం లేకపోవడంతో చుట్టూ షాపుల యజమానులు, కస్టమర్స్ ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు పైనే పార్క్ చేసి హాస్పిటల్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అంబులెన్స్ వచ్చినా లోపలికి వెళ్లే అవకాశం లేకుండా చేశారు. వీటన్నింటికీ ఇక్కడి నుంచే చర్యలు ప్రారంభించాలి. అలా అయితేనే నగరవాసులకు ఏ ప్రమాదం జరిగినా ప్రాణాలు కాపాడుకోవచ్చని ధీమాగా ఉంటుంది. ఎంతటి వారినైనా ప్రభుత్వం ఉపేక్షించదని రుజువు అవుతుంది.