ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని జకార్తాలోని ఓ చమురు నిల్వ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది మరణించారు. మరో 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
సుమారు 250 అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. చమురు నిల్వ కేంద్రానికి సమీపంలోని కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కంపెనీ చుట్టు పక్కల ప్రాంతం మొత్తం దట్టపొగతో నిండిపోయింది.
ఇటీవల భారీ వర్షం సమయంలో పైప్‌లైన్ పగిలిపోయిందని, పిడుగు పాటు వల్ల మంటలు చెలరేగి వుంటాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల దేశంలో చమురు రవాణాకు ఎలాంటి ఇబ్బంది తలెత్తబోదని అధికారులు పేర్కొన్నారు.
చమురు నిల్వ కేంద్రంలో మంటలు చెలరేగడంతో పలు మార్లు పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. దీనిపై ఆ దేశ పెట్రోలియం మంత్రిత్వ శాఖ మంత్రి స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.