నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి- దోమలపెంట గ్రామాల మధ్య కాసుమల్లబావి ఫారెస్ట్ బీటు పరిధిలో మంటలు చెలరేగి అడవి అంటుకుంది. ఎండాకాలం కావడం…ఎండు గడ్డి ఉండడంతో ఎవరో బాటసారులు బీడీ లేదా సిగరెట్ తాగి పడేయంతో మంటలంటుకొని ఉండొచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.
నల్లమల్ల దట్టమైన అడవి ప్రాంతంలో మంటలు చెలరేగడంతో ఇక్కడ నివసించే వన్యప్రాణులకు ప్రమాదం వాటిల్లే అవకాశముంటుంది. దీంతో అటవీశాఖ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రావడం లేదు. గాలి వీస్తుండడంతో మంటలు అడవిని చుట్టుముట్టాయి. ఇప్పటికే 50 నుండి 60 హెక్టారులలో మంటలు వ్యాపించాయి. గాలి తీవ్రత ఎక్కువ కావడంతో అటవీ సిబ్బంది మంటలు అదుపు చేయలేకపోతున్నారు. శ్రీశైలం వెళ్లే వాహనదారులకు ఎన్ని సార్లు హెచ్చరించానా వారి తీరు మారకనే ఇలాంటి ప్రమాదాలకు దారి తీస్తుందని అటవీశాఖ అధికారులు వాపోతున్నారు. వారం రోజుల వ్యవధిలో అడవిలో మంటలంటుకోవడం ఇది రెండోసారి. అటవీ ప్రాంతంలో ఎవరైనా పొగ తాగినా… వంటలు వండుకున్నా వారిపై అటవీ చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు.