వేసవి వస్తుందంటేనే నల్లమల గిరిజనుల్లో ఆందోళన మొదలవుతుంది. ప్రతి ఏటా వందలాది ఎకరాల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతవుతోంది. ఏ అర్ధరాత్రో మొదలయ్యే కార్చిచ్చు.. తెల్లారేసరికల్లా దావానలంలా అడవిని చుట్టేస్తోంది. వేసవి సాకుతో ఎవరైనా ఈ దుస్సాహసం చేస్తున్నారా… లేక దానికదే తగలబడుతోందా అన్నది ఇప్పటికీ మిస్టరీగానే మారింది.
తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో చిచ్చు రేగింది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారి అక్టోపస్ వ్యూ పాయింట్ నుంచి నీలారం బండల వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. కార్చిచ్చుతో నల్లమలలో జీవిస్తున్న చెంచులు ఆందోళన చెందుతున్నారు.