మెగాస్టార్ చిరంజీవి మూవీల సెట్స్ ను అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. కోకాపేటలోని తన స్థలంలో 2019లో సైరా సినిమా కోసం సెట్ వేయించారు చిరు. అప్పట్లో షూటింగ్ సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. భారీ కోట సెట్ వేయగా.. మంటల్లో కాలిపోతే మళ్లీ సెట్టింగ్ వేసి షూట్ కంప్లీట్ చేశారు. అయితే.. మరోసారి అదే స్థలంలో అగ్నిప్రమాదం జరిగింది.
కొరటాల శివ డైరెక్షన్ లో 2022లో ఆచార్య మూవీ వచ్చింది. ఈ సినిమా కోసం కోకాపేటలోని అదే స్థలంలో ప్రత్యేకమైన సెట్ వేశారు. ధర్మస్థలి టెంపుల్, గాలి గోపురం, దాని చుట్టూ ఓ గ్రామంలా భారీ సెట్ ని వేశారు. సినిమా ఫ్లాప్ అయినా.. ఈ సెట్ కు సంబంధించిన విజువల్స్ మాత్రం మూవీలో అద్భుతంగా కనిపించాయి. ఇది ఇప్పటికీ అలాగే ఉంది. అయితే.. ఆ సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది.
సెట్ లోపల మంటలు కనపడటంతో స్థానికులు దగ్గర్లోని ఫైర్ స్టేషన్ కి సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ, అంతలోనే ధర్మస్థలి టెంపుల్, ఆ చుట్టు పక్కల చాలా వరకు మంటల్లో కాలిపోయింది. కోట్ల విలువైన సెట్ క్షణాల్లో బుగ్గిపాలైపోయింది. ఓ వ్యక్తి సెట్ బయట కూర్చొని సిగరెట్ కాల్చి పారేయడంతో మంటలు అంటుకొని అంతటా వ్యాపించి ప్రమాదానికి కారణమైనట్టు చెబుతున్నారు.
ఆర్ట్ డైరెక్టర్ సురేష్ ఈ సెట్ వేశారు. ఇందుకోసం దాదాపు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇప్పుడీ సెట్ అగ్నికి ఆహుతైంది. ఆచార్య సినిమాను హీరో రామ్ చరణ్ నిర్మించాడు.