పంజాబ్ లోని అమృత్ సర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురునానక్ ఆస్పత్రిలో శనివారం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. క్రమక్రమంగా మంటలు ఆస్పత్రి మొత్తాన్ని చుట్టేశాయి. దీంతో ఆస్పత్రి మొత్తం దట్టమైన నల్లని పొగ వ్యాపించింది.
ఆస్పత్రి వెనుక భాగంలో పార్కింగ్ స్థలం దగ్గర ఉన్న ట్రాన్స్ ఫార్మర్ లో మంటలు చెలరేగడంతో ఘటన జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో ఊపిరి ఆడక రోగులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. దీంతో వారు పెద్ద ఎత్తున ఆర్తనాదాలు చేశారు.
రోగులను ఆస్పత్రి వార్డు నుంచి మరో భవనంలోకి వైద్య సిబ్బంది, వారి సహాయకులు తరలించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని అధికారులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ మెట్రోస్టేషన్ సమీపంలోని ఓ భవనంలో శుక్రవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 27 మందికి పైగా మరణించారు. పలువురు గాయపడ్డారు.